ప్లాస్టిక్ తో తయారు చేసినవి వాడద్దు!

ప్లాస్టిక్ నిషేధం పై రామగుండం నగర పాలక సంస్థ విస్తృత ప్రచారం చేపడుతున్నది. గోదావరి ఖని ప్రధాన చౌరస్తాలో గురువారం నిర్వహించిన కళా జాతాల ప్రదర్శన లో భాగంగా ప్లాస్టిక్ నిషేధం , తడి చెత్త , పొడి చెత్త , హానికర చెత్త గా విభజించడం, తడి చెత్త తో ఇంటి వద్ద కంపోస్ట్ తయారు చేయడం వంటి అంశాలపై కళాకారులు ఆడి పాడి ప్రజలకు అవగాహన కల్పించారు. కళాకారులు దయా నర్సింగ్ , పద్మ , రాజయ్య , రమ ఈ ప్రదర్శన నిర్వహించారు. కాగా ప్లాస్టిక్ నిషేధం పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి రామగుండం నగర పాలక సంస్థ చేస్తున్న కృషి ఫలిస్తున్నది. ప్రార్ధనా మందిరాలలో జరిగే కార్యక్రమాల్లో ప్లాస్టిక్ తో తయారు చేసినవి వాడకుండా ప్రత్యామ్నాయ వస్తువులతో తయారు చేసినవి మాత్రమే ఉపయోగించాలని ఇటీవల రామగుండం నగర పాలక సంస్థ సిబ్బంది ఆయా ప్రార్ధనా మందిరాలలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రచారానికి స్పందించిన రామస్వామి పీటర్ అనే వ్యక్తి ఇటీవల మరణించిన తన భార్య జీవమ్మ ( రావులపెల్లి లక్ష్మి ) స్మృత్యర్ధం గౌతమి నగర్ లోని గ్లోరియస్ మినిస్ట్రీ ప్రార్ధనా మందిరం లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ప్లాస్టిక్ తో తయారు చేసినవి కాకుండా ప్రకృతి సిద్దంగా లభించే ఆకుతో తయారు చేసిన విస్తారాకుల్లో వడ్డించారు. అలాగే కాగితపు గ్లాసులలో మంచి నీరు అందించారు. రామగుండం నగర పాలక సంస్థ మేయర్ , కమీషనర్ , సానిటరీ ఇన్స్పెక్టర్ ఆదేశాలతో ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ మధుకర్ , ఎం ఐ ఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ అక్కడకు వెళ్లి అన్నదాన నిర్వాహకులు రామస్వామి పీటర్ ఆయన అల్లుడు వినోద్ కుమార్ లను అభినందించారు. ఇదే ఆనవాయితీని ప్రతి చోటా , ప్రతి విందు లోనూ కొనసాగిచాలని మేయర్ బంగి అనిల్ కుమార్ , కమీషనర్ బి. సుమన్ రావు ప్రజలను కోరారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *