శ్రీ ధర్మశాస్త్రలో పెళ్ళి రోజు వేడుకలు!
తమ పెళ్లి రోజు వేడుకలను అనాథ వృద్ధుల మధ్య జరుపుకోవడం, అన్నదానం చేయడం అభినందనీయమని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ కార్పొరేటర్ రాకం లతా-దామోదర్ అన్నారు. సింగరేణి ఆర్జీ-1 పరిధి 2ఏ గని ఎస్డిఎల్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సింగరేణి కార్మికుడు సాన జలపతి- రమాదేవి దంపతులు తమ పెళ్లిరోజు రజతోత్సవ వేడుకలను ఆదివారం తిలక్ నగర్ లోని శ్రీ ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదికలోని వృద్ధుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు. ముందుగా కేక్ కట్ చేసారు. అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేసారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన మల్లయ్య, లతా-దామోదర్ మాట్లాడుతూ పెళ్ళి రోజు వేడుకలను అట్టహాసంగా, ఆర్భాటంగా నిర్వహించుకోవడం కాకుండా అనాధ వృద్దుల మధ్య నిరాడంబరంగా జరుపుకోవడం, సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. వారు మరెన్నో పెళ్లి రోజులు ఆనందంగా, అన్యోన్యంగా జరుపుకోవాలని శుభాకాంక్షలు అందజేశారు. వీరి స్ఫూర్తిగా తమ పుట్టినరోజు, పెళ్ళి రోజు వేడుకలలో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి మరింత మంది ముందుకు రావాలన్నారు. సేవా కార్యక్రమాలకు వేదికైన శ్రీ ధర్మశాస్త్ర నిర్వహకులను అభినందించారు. జలపతి- రమాదేవి దంపతులను సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో దాసరి నర్సయ్య, పర్లపల్లి రవి, మేజిక్ రాజా, హరి, పులియాలసతీష్ కుమార్, బొజ్జ శ్రీనివాస్, కుటుంబ సభ్యులు, మిత్రులు, ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.