హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకట్!.. నేడు అధికారికంగా ప్రకటన వ్యూహం మార్చిన కాంగ్రెస్.. ప్రచారాస్త్రంగా విద్యార్థి ఉద్యోగ సమస్యలు..
హుజురాబాద్ అభ్యర్థి ఎంపి కపై కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా వ్యవ హరిస్తూ పావులు కదుపుతున్నారు. ఈ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను పోటీకి పెట్టడంతో కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం (ఎన్ఎస్ యూఐ) అధ్యక్షుడిగా ఉన్న బలమూరు వెంకట్‌ను బరిలో దింపేందుకు ఆ పార్టీ నాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహా రాల ఇన్‌ఛార్జి మాణిక్య ఠాగూర్‌తో సమాలో చనలు జరిపి బలమూరు వెంకట్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించే యోచ నలో కాంగ్రెస్ రాష్ట్ర పెద్దలు ఉన్నట్టుతెలుస్తోంది. హుజు రాబాద్ ఉప ఎన్నికలో నిరుద్యోగ సమ స్యను ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించిన కాంగ్రెస్ శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్ధి నిరుద్యోగ సైరన్ మోగిస్తున్న సంగతి తెలిసిందే. 65 రోజులపాటు సాగే ఈ కార్యక్రమంలో విద్యార్థి, నిరుద్యోగ సమస్యలను ఎలుగెత్తి చాటాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా శనివారం మధ్యాహ్నం దిల్సుఖ్నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తోంది. ప్రదర్శన అనంతరం జరిగే సభలో హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బలమూరు వెంకట్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ప్రాంతానికి చెందిన వెంకట్ విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై తీవ్ర స్థాయిలో పోరాడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే పెద్దపల్లి నియో జకవర్గం నుంచి పోటీకి దిగాలని వెంకట్ నిర్ణ యించినా అప్పుడున్న పరిస్థితుల కారణంగా ఆయనకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కీలకంగా వ్యవహ రించిన వారిలో వెంకట్ కూడా ఉన్నారు. ఇదే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను తెరాస పోటీకి నిలబెట్టడంతో ధీటుగా బలమూరు వెంకటు ని బరిలోకి దింపి సత్తా చాటాలన్న నిర్ణయానికి పీసీసీ చీఫ్ రేవంత్ వచ్చినట్టు తెలుస్తోంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు జీవన్‌రెడ్డి, శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు సైతం వెంకట్ అభ్యర్థిత్వానికి మద్దతు పలికినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. స్థానిక నాయకులను ఈ ఉప ఎన్నికలో పోటీకి పెట్టాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో వెంకట్ అభ్యర్థిత్వాన్ని అందరూ స్వాగతిస్తారన్న ధీమాతో పార్టీ నేతలున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి హుజురాబాద్‌లో 62వేల ఓట్లు వచ్చాయని ఈ ఉప ఎన్నికలో ఉదృతంగా ప్రచారం చేసి కష్టపడి పని చేస్తే మరో 30వేల ఓట్లు సాధించవచ్చని పార్టీ నేతలు లెక్కలేస్తున్నారు. బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్, తెరాస అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్, బలమూరు వెంకట్ పోటీ చేయడం ద్వారా త్రిముఖ పోటీ జరుగుతుందని తద్వారా తమ పార్టీ అభ్యర్థి అత్యధిక ఓట్లు సాధించి విజయ తీరానికి చేరుతారన్న ఆశలో కాంగ్రెస్ పార్టీ ఉంది..