సింగరేణి లో సమ్మె సైరన్!
సింగరేణిలో సమ్మె మొదలైంది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు నిరసనగా 72 గంటల పాటు సమ్మెకు పిలుపునిచ్చిన కార్మికులు గురువారం ఉదయం విధులు బహిష్కరించారు.ఈ సమ్మెలో 42వేల మంది రెగ్యులర్, 25వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొంటున్నారు. కార్మికుల సమ్మెతో 23 భూగర్భ, 19 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం జాబితాలో చేర్చడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే దాకా పోరాటం సాగుతుందని కార్మిక సంఘాలు వెల్లడించాయి.సింగరేణిలో 23 భూగర్భ, 19 ఉపరితల గనులున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కోయగూడెం బ్లాకు-3, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి బ్లాకు-3, మంచిర్యాల జిల్లాలోని కళ్యాణఖని-6, ఆసిఫాబాద్ జిల్లాలోని శ్రావణపల్లి బ్లాకులకు సింగరేణి సంస్థ రూ.167 కోట్లు ఖర్చు చేసింది.అన్వేషణతో పాటు ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసుకుంది. బొగ్గు ఉత్పత్తి చేపట్టేందుకు అనుమతుల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఆ నాలుగు బ్లాకులకు కేంద్ర ప్రభుత్వం వేలం ప్రకటన ఇచ్చింది.ఈ నెల 3, 6 తేదీల్లో సింగరేణి యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో గురువారం ఉదయం షిఫ్టు నుంచి కార్మికులు విధులు బహిష్కరించారు.