జాతీయ స్థాయి పురస్కారం అందుకున్న ఖని కళాకారులు..
గోదావరిఖనికి చెందిన హాస్యాభినయ కళాకారులు చంద్రపాల్, ఇంద్రజాల కళాకారులు మేజిక్ హరి బుధవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కృషి కల్చరల్ ఆర్ట్స్ ద్వి దశాబ్ది ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, దైవజ్ఞ శర్మ చేతుల మీదుగా జాతీయ స్థాయి కళాకృషి పురస్కారం అందుకున్నారు. వీరిరువురు సింగరేణి కార్మికులు కావడం విశేషం. హరి సింగరేణి ఆర్జీ-1 పరిధి 2ఏ గనిలో మైనింగ్ సర్దార్ గా విధులు నిర్వహిస్తుండగా, చంద్రపాల్ ఆర్జీ-3 ఏరియా ఓసిపి-1లో ఈపీ ఆపరేటర్ గా పని చేస్తున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇంద్రజాల రంగంలో విశిష్ట కృషి చేసినందుకుగాను హరిని, హాస్యాభినయ,లఘు చిత్ర నిర్మాణ రంగంలో కృషి చేసినందుకుగాను చంద్రపాల్ ను సంస్థ నిర్వాహకులు ఈ పురస్కారాలకు ఎంపిక చేసారు.
ఇంకా ఈ కార్యక్రమంలో కృషి కల్చరల్ ఆర్ట్స్ అకాడెమీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నిట్టూరి రాజరత్నం కుమారులు సీనియర్ జర్నలిస్ట్ జీవన్ బాబు, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు రాజు, కార్యక్రమ నిర్వాహకులు కాసిపాక రాజమౌళి, కె.రామస్వామి, కనకం రమణయ్య, సిరిపురం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.కాగా చంద్రపాల్, హరి జాతీయస్థాయి పురస్కారాలు అందుకోవడంపట్ల పలువురు కళాసంఘాల భాద్యులు అభినందనలు తెలిపారు.