పచ్చని చెట్లు, ఆహ్లాద భరితమైన వాతావరణంతో ఉద్యానవనం తలపిస్తున్న రక్షక నిలయం, పోలీసులు ప్రజలతో స్నేహ పూర్వకంగా మెలుగుతూ వారితో మమేకం కావాలి. ఠాణాలో మెరుగైన సౌకర్యాలు పక్కాగా 5S అమలు.. వర్టీకల్స్ తో సిబ్బంది పనితీరు మెరుగు… ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రామగుండం కమిషనర్ శ్రీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్ ఆదేశానుసారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ బసంతనగర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణం లో 5-ఎస్ ఇంప్లిమెంట్ కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ను 17 భాగాలుగా విభజించి కానిస్టేబుల్ స్థాయి అధికారి నుండి ఎస్ఐ ల వరకు ఒక్కొక్క విభాగానికి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించి ఆహ్లాదభరితంగా, సుందరంగా తీర్చిదిద్దారు. ఎస్ఐ మహేందర్ రెండు నెలలుగా పోలీస్ స్టేషన్ ఆధునికీకరణ పనులు, పచ్చని గడ్డితో పాటు వివిధ రకాల మొక్కలు ఏర్పాటు చేశారు. ఠాణాకు వచ్చే వారు సేదతీరేందుకు ప్రత్యేకంగా బెంచీలు, పోలీస్ వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక షెడ్డు నిర్మించారు. ఈ రోజు రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ (ఐజి) గారు బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ ను అధికారులతో కలిసి సందర్శించి ఆహ్లాద భరితంగా తయారు చేసిన పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ…..పోలీస్ స్టేషన్ పరిసరాలు మొక్కలతో ఉండటంతో స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఎంత సేపు పనిచేస్తున్నా అలసట ఉండదు. పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రజలు స్వచ్చమైన గాలిని పీల్చుకుంటారు అన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజల సౌకర్యార్థం పోలీస్ స్టేషన్ లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ స్టేషన్ ఆవరణ ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్ది వివిధ రకాల పూల మొక్కలు, పెద్ద ఎత్తున నాటడం తో పచ్చదనం వెల్లివిరుస్తోంది అన్నారు. బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ లో 5S ఇంప్లిమెంటేషన్ పక్కాగా అమలు జరుగుతోంది. స్టేషన్ లోని విధులు వర్టీకల్స్ వారిగా ఒక్కొక్కరికి ఒక్కో వర్టికల్ విభాగాన్ని అప్పగించడంతో ఫైళ్ల క్రమబద్ధీకరణ జరగడంతో పాటు పనితీరు మెరుగు పడింది. దీంతో పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలకు త్వరితగతిన సేవలు అందుతున్నాయి అన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులను గౌరవించాలని, వారి సమస్యలను ఓపికగా తెలుసుకొని పరిష్కార మార్గాలు సూచించాలని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పోలీస్ స్టేషన్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నారు.గంజాయిని పూర్తిస్థాయిలో నియంత్రించి గంజాయి రహిత కమిషనరేట్ గా రామగుండం ను తీర్చిదిద్దుతామని పోలీస్ కమిషనర్ చంద్రశేఖరరెడ్డి అన్నారు. గంజాయి నియంత్రణ కోసం ముద్రించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. గంజాయి వంటి మత్తుపదార్థాల నియంత్రణకు అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. మత్తు పదార్థాల వాడకం వల్ల యువత బంగారు భవిష్యత్తు బుగ్గిపాలవుతుందని, వీటి నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రెండు జిల్లాల్లో ప్రజాప్రతినిధులకు, యువకులకు, విద్యార్థులకు గంజాయి వాడకం వల్ల జరిగే నష్టాల తోపాటు నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై త్వరలోనే అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు.గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే సత్వరమే సమాచారం పోలీస్ స్టేషన్కు చేరేలా సమాచార వ్యవస్థను ఏర్పర్చుకోవాలన్నారు. పోలీస్ అధికారులు సిబ్బంది ప్రజలతో మంచి సంబంధాలను ఏర్పరచుకొవాలని, చట్టవ్యతిరేకమైన అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజల సమస్యలు చట్టపరిధిలో పరిష్కరిస్తూ వారి మన్ననలను పొందాలని అన్నారు. *పోలీస్ స్టేషన్ ను మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేలాగా ఏర్పాటుకు కృషి చేసిన ఏసిపి సారంగపాణి, సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ మహేందర్,శివాని లను,సిబ్బందిని సీపీ …. ప్రత్యేకంగా అభినందించారు.