ఉద్యమంలా హరిత హారం
ఉద్యమంలా హరిత హారం కార్యక్రమoలో పాల్గొని రామగుండం నగరంలో పచ్చదనం పెంపొందించుకుందామని రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్ బంగి అనిల్ కుమార్ అధ్యక్షతన బుధవారం నగర పాలక సంస్థ పాలక వర్గ ఐదవ అత్యవసర సమావేశం నిర్వహించారు. నగర పాలక సంస్థ ఎక్స్ అఫిషియో సభ్యుడి హోదాలో ఈ సమావేశానికి హాజరైన ఎం ఎల్ ఎ మాట్లాడుతూ రాష్ట్ర భూభాగంలో 33 శాతం ఆటవీకరణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కె సి ఆర్ ప్రవేశ పెట్టిన తెలంగాణకు హరిత హారం కార్యక్రమంతో పచ్చదనం పెంపొందించడంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణ రాష్ట్రమే ముందంజలో వుందని అన్నారు.
మున్సిపల్ పరిధిలోని గోదావరి నదీ పరీవాహక ప్రాంతాన్నిజనగామ నుండి ఓ సి పి వరకు పరిశుభ్రం చేసి మొక్కలు నాటి సంరక్షిస్తే నగరంలో కాలుష్యం తగ్గిపోవడంతో పాటు సుందరంగా వుంటుందని అన్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరo భాగస్వాములవుదామని అన్నారు. మొదటి విడతలో స్థానికంగా నర్సరీలు లేక ఇతర ప్రాంతాలనుండి మొక్కలు తెచ్చుకునే వారమని, ఇప్పుడు స్వయం సహాయక సంఘాల సహకారంతో నర్సరీలు అందుబాటులోకి రావడంతో పాటు స్వశక్తి మహిళలకు ఆర్థికoగా తోడ్పాటుగా కూడా వుంటోందని అన్నారు. వాతావరణ సమతుల్యత ను కాపాడే మొక్కల పెంపకo పై ప్రత్యేక శ్రద్ద పెట్టి తెలంగాణకు హరిత హారం కార్యక్రమానికి ఈ సమావేశపు అజెండా లో పెద్ద పీట వేయడం పట్ల నగర పాలక సంస్థ పాలక వర్గ సభ్యులను , అధికారులను ఆయన అభినందించారు. ఇంటింటికి ఆరు మొక్కలను పంపిణీ చేసి వాటి సంరక్షణ కూడా పర్యవేక్షించాలని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల భాగస్వామ్యంతో ఎనిమిదవ విడత హరిత హారం కార్యక్రమాన్ని మరింత సమర్ద వంతంగా చేపట్టాలని అన్నారు.
నగర మేయర్ బంగి అనిల్ కుమార్ మాట్లాడుతూ మొక్కలు నాటడంతో పాటు 85 శాతం మొక్కలు బ్రతికి వుండేలా వార్డు అధికారులు , ప్రజా ప్రతినిధులు పర్యవేక్షించాలని ఈ విధులను నిర్లక్ష్యం చేసిన వారిపై కొత్త మున్సిపల్ చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ కు హరిత హారం కార్యక్రమంలో భాగంగా రామగుండం నగర పాలక సంస్థ చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గ్రీన్ అవార్డు వచ్చిందని ఇటీవల ఢిల్లీ లో నిర్వహించిన కార్యక్రమంలో తానే ఈ అవార్డ్ స్వీకరించానని ఆయన తెలిపారు. నగర పాలక సంస్థ గ్రీన్ బడ్జెట్ నిధులు , ఎన్టి పి సి సి ఎస్ నిధులు రూ.9.00 కోట్లు వెచ్చించి ఎనిమిదవ విడత హరిత హారం కార్యక్రమాన్నిఈ దఫా మరింత పకడ్బందీగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
నగర పాలక సంస్థ కమిషనర్ బి. సుమన్ రావు మాట్లాడుతూ కార్పొరేటర్ల సూచన మేరకు ఎనిమిదవ విడత హరిత హారం కార్యక్రమాన్ని డివిజన్ స్థాయిలో , పట్టణ స్థాయిలో పర్యవేక్షించేందుకు కమిటీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. గోదావరి నది ఒడ్డున జనగామలో , ఐ టి ఐ కళాశాల , ఆర్ ఎఫ్ సి ఎల్ ఫ్యాక్టరీ ప్రాంగణాలలో బ్లాక్ ప్లాంటేషన్ కొరకు స్థలాలు గుర్తించామనీ అలాగే బి పవర్ హౌస్ నుండి గోదావరి బ్రిడ్జి వరకు సర్వీస్ రోడ్ల వెంబడి అవెన్యూ ప్లాంటేషన్ చేపతామని అన్నారు. ఈ ఎనిమిదవ విడత హరిత హారం కార్యక్రమాన్ని మరింత ప్రభావవంతంగా చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కార్పొరేటర్లు పెంట రాజేష్ , ధాతు శ్రీనివాస్ , బొంతల రాజేష్ , మహంకాళి స్వామి, కొలిపాక సుజాత తదితరులు మాట్లాడుతూ మొక్కలు నాటడానికి స్థల ఇబ్బందులు ఏర్పడకుండా సింగరేణి అధికారులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని అలాగే నిధులు వృధా కాకుండా చూడాలని అన్నారు.
కాగా ఎనిమిదవ విడత హరిత హారం కార్యక్రమంలో భాగంగా నర్సరీలను అభివృద్ది చేయడానికి రూ. 68.00 లక్షలు , ఇదివరకు వున్న పార్కులు , కూడళ్ళు , అమృత్ పార్కులు , పాత డంపింగ్ యార్డ్ లో మొక్కల నిర్వహణ కొరకు రూ. 36.00 లక్షలు , నూతన ట్రీ పార్కుల ఏర్పాటు కొరకు రూ. 157.00 లక్షలు , అవెన్యూ ప్లాంటేషన్ కొరకు రూ. 285 .00 లక్షలు ఇతర పనుల కొరకు రూ. 17.00 లక్షలు, ఎన్ టి పి సి- సి ఎస్ ఆర్ నిధులు రూ 9.00 కోట్లతో ప్లాంటేషన్ కలిపి మొత్తం రూ. 14 కోట్ల 63 లక్షలతో వివిధ పనులు చేపట్టడానికి ఏకైక అంశం ఈ సమావేశంలో ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు.
సమావేశంలో డెప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు , కార్పొరేటర్లు , కో ఆప్షన్ సభ్యులు , మున్సిపల్ అధికారులు నారాయణ రావు , చిన్నా రావు , మాధవి , యాదగిరి , మనోహర్ తదితరులు పాల్గొన్నారు.