నిందితులను బహిరంగంగా ఉరితీయాలి…
ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేస్తున్నాడని దళిత యువకుడు నాగరాజును యువతి సోదరులు హత్య చేశారని ఆల్ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాంపెల్లి సతీష్ ఒక ప్రకటనలో ఆరోపించారు. దళిత యువకుడు నాగరాజు హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. కేవలం నాగరాజు దళితుడనే నెపంతోనే యువతి సోదరులు హత్య చేశారని సతీష్ పేర్కొన్నారు. అటు దేశంలో.. ఇటు తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ దళితులకు రక్షణ లేకుండా పోతోందని, ప్రతి రోజూ ఏదోచోట దళితుల పై హత్యలు, దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల కోసం ఎన్ని చట్టాలు తీసుకు వస్తున్నప్పటికీ దళితులపై ఇలాంటి సంఘటనలు ఆగకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. దళితులకు రక్షణ కల్పించడంలో పాలక ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దళితుల రక్షణకు మరిన్ని కఠిన చట్టాలను తీసుకురావాలని అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. కేవలం ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి దళిత యువకుడు నాగరాజు నిండు నూరేళ్ళ జీవితాన్ని అంతమొందించారని పేర్కొన్నారు. నాగరాజును హతమార్చిన యువతి సోదరులను బహిరంగంగా ఉరితీయాలని ఆయన డిమాండ్ చేశారు . మళ్లీ దళితులపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు . నాగరాజు కుటుంబానికి న్యాయం జరిగేలా దళిత సంఘాలు పోరాడుతాయని ఆయన అన్నారు. నాగరాజు కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని, సహాయం అందించాలని కోరారు.