జనగామ భూనిర్వాసితులకు సింగరేణిలో ఉద్యోగ అవకాశం కల్పించాలి : టిడిపి
రామగుండం పారిశ్రామిక ప్రాంతం జనగామలో భూ నిర్వాసితుల సమస్యలపై శనివారం జనగామలో టిడిపి నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా బాధితుల సమస్యలను తెలుసుకుంటూ, మీకు న్యాయం జరిగేంత వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యం జనగామ గ్రామ ప్రాంతంలో కాకతీయుల కాలం నుండి సాగుచేసుకుంటున్న భూములను తీసుకొని రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించకుండా దాట వేయడం సింగరేణి యాజమాన్యానికి తగదని అన్నారు. రైతులకు, భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి, వారి కుటుంబంలో ఒక్కరికి సింగరేణిలో ఉద్యోగ అవకాశం కల్పించాలని, అదేవిధంగా ఒక రైతు కుటుంబానికి 250 గజాల ఇల్లు కట్టించి ఇవ్వాలని, తెలుగుదేశం పార్టీ రాష్ట్రప్రభుత్వం, సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిపి ఉద్యమం చేయక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఎన్టియుసి వర్కింగ్ ప్రెసిడెంట్ బైరం శంకర్, ఎర్రం అంకిరెడ్డి, పెగడపల్లి రాజనర్సు, జనగామ స్వామి, కూన లక్ష్మయ్య, వెంకన్న, జ్యోతి, చిటికెల రాజలింగం, మల్లమ్మ, మరియు గ్రామస్తులు,రైతులు పాల్గోన్నారు.