ఇంటింటా సర్వే చేయాలి
ఓటరు జాబితా సర్వే లో భాగంగా ఇంటింటికి తిరిగే క్రమంలో కోవిడ్ -19 వాక్సినేషన్ మొదటి , రెండవ డోస్ తీసుకొని వారిని కూడా జాబితాలో గుర్తించాలని పెద్దపల్లి ఆర్ డి ఓ, రామగుండం నగర పాలక సంస్థ కమీషనర్ ( (ఎఫ్ ఏ సి ) శంకర్ కుమార్ బూత్ లెవల్ అధికారులను ఆదేశించారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం బూత్ లెవెల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ లో భాగంగా ఇంటింటికి వెళుతున్న క్రమంలో ఇంకా వాక్సిన్ వేసుకోని వారిని కూడా గుర్తించి జాబితాను తదుపరి చర్యల నిమిత్తం వైద్య ఆరోగ్య శాఖాధికారులకు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారని ఆయన అన్నారు. నగర పాలక సంస్థ సిబ్బంది వాక్సిన్ తీసుకోనట్లయితే వారిపై చర్యలు ఉంటాయన్నారు. ఈ నెల 18 వ తేదీ లోపు బూత్ లెవెల్ అధికారులు ఓటరు జాబితా ప్రకారం ఇంటింటా సర్వే పూర్తీ చేసి వాక్సిన్ వేసుకొని వారి జాబితాను తయారు చేసి అందజేయాలని కోరారు. ఈ నెల 27, 28 తేదీలలో ఓటరు జాబితా సర్వే పురోగతి సమీక్షించడానికి అబ్జర్వర్ వీర బ్రహ్మయ్య జిల్లాకు విచ్చేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఓటరు జాబితాలో రెండు సార్లు పేర్లు నమోదు అయిన వారిని గుర్తించి ఒక చోట తొలగించాలని సూచించారు. గరుడ యాప్ ఉపయోగించడంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రామగుండం మండల తహసిల్దార్ రమేష్ కుమార్ డిప్యుటీ తహసిల్దార్లు కిరణ్ , వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.