మంత్రి గంగుల కమలాకర్‌కు హైకోర్టులో ఊరట!!

దర్వాజ ప్రతినిధి: బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. పిటిషనర్‌ ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని చెప్పింది. 2018 ఎన్నికల్లో పరిమితికి మించి గంగుల కమలాకర్‌ ఎన్నికల ఖర్చు చేశారంటూ కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్‌(ఈపీ) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ చిల్లకూర్‌ సుమలత బుధవారం తీర్పు వెల్లడించారు. ‘ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్-77కి విరుద్ధంగా గంగుల కమలాకర్‌ ఎన్నికల్లో అదనపు వ్యయం చేశారు. ఆయన సమర్పించిన రోజువారీ లెక్కల ప్రకారం.. 2018, డిసెంబర్‌ 7 వరకు చేసిన మొత్తం ఎన్నికల ఖర్చు రూ.50,36,531.85. దీనిని అసిస్టెంట్ రిజిస్ట్రార్ కూడా ధృవీకరించారు. 1961 ఎన్నికల నియమావళిలోని రూల్ 90 ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్దేశించబడిన ఎన్నికల ఖర్చుల గరిష్ట పరిమితి రూ.28,00,000. ప్రజాప్రతినిధ్య చట్టంలోని సెక‌్షన్ 123(6) ప్రకారం ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయడం ద్వారా గంగుల అవినీతి పాల్పడ్డారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, అక్రమ పద్ధతిలో గెలిచిన కమలాకర్‌ ఎన్నిక రద్దు చేయాలి’ అని పిటిషనర్‌ తరఫున టి.సూర‍్య సతీశ్‌ వాదనలు వినిపించారు.సాక్ష్యంలేదు.. అనర్హుడిగా ప్రకటించలేం..‘కమలాకర్‌ ఎన్నికల్లో రూ.27,46,037.35 మాత్రమే వ్యయం చేశారు. ఆ మేరకు వివరాలు కూడా సమర్పించారు. ఇది నిబంధనల మేరకు రూ.28,00,000 కంటే తక్కువే. పొన్నం ప్రభాకర్‌ ఎలాంటి సాక్ష్యం లేకుండా ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. రోజువారీ ఖర్చుల వివరాలకు సంబంధించి పేజీలను పిటిషన్‌కు జత చేయడంలో తప్పులకు పాల్పడ్డారు’ అని గంగుల తరఫున సీనియర్‌ న్యాయవాది శ్రీపాద ప్రభాకర్‌ వాదించారు. ఇరుపక్షాల వాదనలను నమోదు చేసుకున్న న్యాయమూర్తి తీర్పు వెల్లడిస్తూ.. రూ.50,36,531.85 ఎన్నికల ఖర్చును అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ధృవీకరించినట్లు పొన్నం పేర్కొనగా, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ మాత్రం గంగుల రూ.27,46,037.35 ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో కమలాకర్‌ ఎన్నిక రద్దు చేయడానికి ఎలాంటి మెరిట్‌ కనిపించడం లేదన్నారు. అతన్ని అనర్హుడిగా ప్రకటించలేమని పేర్కొంటూ.. పిటిషన్‌ను కొట్టివేశారు. మరోవైపు గంగుల ఎన్నికను రద్దు చేయాలంటూ భాజపా ఎంపీ బండి సంజయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టనుంది.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *