పుస్తకాలే…. పురోభివృద్ధికి పునాదులు !
నేడు ”అంతర్జాతీయ పుస్తక దినోత్సవం”. …ప్రముఖ రచయితలు సెర్వాంటిస్, విలియం షేక్స్‌పియర్ వర్థంతి నేపథ్యంలో ఏప్రిల్ 23వ తేదీన ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ పుస్తక, ప్రచురణ, కాపీరైట్ దినోత్సవం జరపాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది.ఆ మేరకు ఏటా ఉత్సవాలు స్ఫూర్తిదాయకం.”పుస్తకాలు మనో మాలిన్యాలను తొలగించే దీపాలు” అంటారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. నిజమే కదా..! ఆదిమ సమాజం నుంచి నేటి ఆధునిక యుగం వరకూ మానవ జీవితానికి పుస్తకాలు వారధులుగా నిలిచాయి.పుస్తక పఠనం ద్వారానే మానవుడు తనను తాను తెలుసుకుంటూ,గత సమాజ నిర్మాణాన్ని,నాగరికత అభివృద్ధినీ,అవపోసన పట్టి నేటి ఆధునిక దశకు చేరుకున్నాడు.చదవటం ద్వారానే మనిషి మేధస్సు పరిఢవిల్లి అనేక అద్భుతాలు,ఆవిష్కరణలు చేయగలిగింది అని చరిత్ర చెబుతోంది.ప్రఖ్యాత రచయిత ”బెకన్” చెప్పినట్లు కొన్ని పుస్తకాలు రుచి చూడాలి, కొన్ని మింగేయాలి, కొన్ని నమిలి జీర్ణించుకోవాలి” . థామస్ పెయిన్ రాసిన ”రైట్స్ అఫ్ మేన్” పుస్తకం చదివి నమిలి జీర్ణించు కోవడం ద్వారానే ”జ్యోతి రావు ఫూలే” మనదేశంలో ఉన్న కుల,మత,లింగ అసమానతలు పారద్రోలడానికి ఉక్కుపిడికిలి బిగించాడు. గురజాడ అప్పారావు రాసిన ”కన్యాశుల్కం” చదవటం ద్వారానే ఆరోజుల్లో బాల్యవివాహాలు అరికట్టగలిగారు.”ది రూట్స్” పుస్తకం నల్లజాతీయుల చీకటి జీవితాలను ప్రపంచానికి చాటి చెప్పింది. పుస్తక పఠనం ద్వారా అబ్రహం లింకన్, నెల్సన్ మండేలా, మహాత్మా గాంధీ, అంబేద్కర్ వంటి ఎందరో మేధావులు సమాజంలో ఉన్న అనేక అసమానతలపై పోరుబాట పట్టి, ప్రపంచంలో మానవులు అంతా సమానమే అనే భావన కల్పించారు. శ్రమ దోపిడీపై ”కారల్ మార్క్స్ రచనలు” ప్రపంచ గమనానికే దిక్సూచిగా నిలిచాయి. సామ్యవాద భావాలు ప్రపంచంలో ప్రకాశిస్తున్నాయి. అనేక దేశాల్లో సామ్యవాద, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటుకు ఆలంబన అయినాయి…అందుకే కందుకూరి వీరేశలింగం పంతులు ”చిరిగిన చొక్కా అయినా తొడుక్కో మంచి పుస్తకం కొనుక్కో” అని ఆనాడే చెప్పారు. ఒక వ్యక్తి మనో వికాసానికి, విజ్ఞాన సంపదకు నిలయం పుస్తకాలే. నేటి ఆధునిక కాలంలో చాలామంది పుస్తక పఠనానికి దూరం అవుతున్నారు. టీవీ, సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్, మెబైల్ ఫోన్‌ల మూలంగా చాలామంది మంచి రచనలు,అభ్యుదయ రచనలు చదవడం లేదు. కాలక్షేపానికి వినోద కార్యక్రమాలు,గేమ్స్, అనవసరమైన ఛాటింగ్‌లతో ఎక్కువ సమయం వృధా అవుతోంది. యువత పుస్తక పఠనం చేయాలి. సామాజిక,ఆర్థిక, రాజకీయ చైతన్యం అందిపుచ్చుకోవాలి. శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలి. ఏమిటి? ఎందుకు? ఎలా? అనే ప్రశ్నలు వేసుకోవాలి. దేశ, రాష్ట్ర పాలనా విధానాల పట్ల అవగాహన పెంచుకోవాలి. ప్రపంచ పరిణామాలను అర్థం చేసుకోవాలి.దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా.. అందరికీ చదువు,అవకాశాలు అందని ద్రాక్షగానే ఎందుకున్నాయో యోచించాలి. ఇలాంటి సమయంలో మధురై నగరంలో అతి పెద్ద గ్రంథాలయం నిర్మాణానికి తమిళనాడు ప్రభుత్వం శ్రీకారం చుట్టుడం శుభసూచకం.పుస్తక పఠనం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది.నూతన ఆలోచనలు కలుగుతాయి.నూతన ఆవిష్కరణలు జరుగుతాయి. శాస్త్రీయ దృక్పథం కలిగి మూఢ నమ్మకాలు, ఆచారాలు విశ్వాసాలు అంతరిస్తాయి.అయితే ”మనం చదివే పుస్తకం మనలోని అజ్ఞానాన్ని ఒక మొట్టికాయ వేసి, మేల్కొలిపే విధంగా ఉండాలని… గడ్డకట్టిన సముద్రాన్ని గొడ్డలితో పగలగొట్టే విధంగా ఉండాలని” ప్రముఖ రచయిత ”కాఫ్కా” చెప్పిన మాటలు గమనంలో ఉంచుకోవాలి.ప్రస్తుతం గుడులు, గోపురాలు, ఆశ్రమాలు, విగ్రహాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. కానీ విజ్ఞానం పెంచే గ్రంథాలయాల నిర్మాణానికి ముందుకు వచ్చేవారు బహుతక్కువుగా ఉండుట గమనార్హం. ప్రతీ పాఠశాలకు, కళాశాలకు గ్రంథాలయాలు, పుస్తకాలు ఏర్పాటు చేయాలి. నిధులు మంజూరు చేయాలి.లౌకిక విధానానికి అనుగుణంగా ప్రభూత్వాలు సిలబస్, పుస్తకాలు ప్రచురించాలి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం నైపుణ్యాలు మెరుగుపరచే అంశాలు ప్రవేశపెట్టడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి. పూర్వ కాలం నుంచి నేటి వరకూ మానవుని పురోభివృద్ధికి మార్గాలు పుస్తకాలు మాత్రమేనన్న సంగతి గుర్తించాలి… ”పుస్తకం హస్తభూషణం” మాత్రమే కాదు,శరీరానికి రక్తప్రసరణ ఎంత అవసరమో, సమాజానికి పుస్తక పఠనం అంత అవసరమని గ్రహించడమే ఈ ప్రపంచ పుస్తక దినోత్సవ పరమార్థం…_ దర్వాజ టీం