వారి రక్త తర్పణ కార్మిక లోకానికి కొత్త దిశ!
కార్మికుడు తన రక్త మాంసాలు కరిగించి, చెమట చిందించి పనిచేస్తేనే మనం ముందుకు సాగేది. వారి శ్రమను గుర్తిస్తూ జరుపుకొంటున్నదే ‘మే’ డే! ఈ రోజు కార్మికుల ఐక్యత, పోరా టానికి నిదర్శనం. నిజానికి మే డే ఎలా వచ్చిందంటే… కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886 మే1న చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారు. దానికి మద్దతుగా నాలుగు రోజుల తర్వాత షికాగోలోని ‘హే మార్కెట్’లో చాలామంది ప్రదర్శన నిర్వహించారు. కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు. వారి రక్తతర్పణ ప్రపంచానికే కొత్త దిశను చూపింది. ఆ ఘటన తర్వాత 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలూ, నిరసన ప్రదర్శనలూ చోటుచేసుకున్నాయి.1890 మే 1న బ్రిటన్లోని ‘హైడ్ పార్క్’లో చేపట్టిన ప్రద ర్శనకు దాదాపు 3 లక్షల మంది కార్మికులు హాజరయ్యారు. తామూ మనుషులమేననీ, తమ శక్తికి కూడా పరిమితులుం టాయనీ కార్మికులు నినదించారు. పనిముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడారు. 24 గంటల్లో ఎనిమిది గంటలు పనీ, ఎనిమిది గంటలు విశ్రాంతీ, మరో ఎనిమిది గంటలు రిక్రియేషన్ను ఈ పోరాటం ద్వారా కార్మికులు సాధించుకున్నారు. అలాగే మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపు కోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది. 1923లో తొలిసారి ఇండియాలో ‘మే’ డేను పాటించారు