42 కోట్ల బంగారం పట్టివేత!
భారీగా బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. దాదాపు 86 కేజీల బంగారాన్ని సీజ్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.42 కోట్ల వరకు ఉంటుందని అధికారుల అంచనా. హాంకాంగ్ నుంచి ఎయిర్ కార్గో ద్వారా ఢిల్లీకి వచ్చిన పార్శిల్లో బంగారం ఉన్నట్టుగా డిఆర్ఐ అధికారులు గుర్తించారు. బంగారాన్ని కరిగించి ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రోప్లేటింగ్ మెషిన్లో దాచి, పైన నికెల్‌తో పూతపూసి తరలించే ప్రయత్నం చేశారు.అయితే, కార్గో ఎయిర్‌లో అత్యాధునిక స్కానింగ్‌తో డిఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ స్కానింగ్‌లో బంగారం గుట్టు బయటపడింది. అక్రమ బంగారం సరఫరా కేసును నమోదు చేసిన అధికారులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇద్దరు దక్షిణ కొరియా దేశస్థులు కాగా, మరో ఇద్దరిని చైనా, తైవాన్ దేశస్థులుగా గుర్తించారు. స్మగ్లర్లు బంగారాన్ని రకరకాల పద్దతుల ద్వారా రవాణా చేసేందుకు ప్రయత్నాలు చేసి చివరికి పట్టుబడుతున్నారని కస్టమ్స్ అధికారులు పేర్కొంటున్నారు