కళాకృషి పురస్కార్ కు ఎంపికైన చంద్రపాల్..

ఆర్జీ-3 ఏరియా ఓపెన్ కాస్ట్-1 లో ఈ.పి.ఆపరేటర్ గా పనిచేసే పోతుల చంద్రపాల్ జాతీయ స్థాయి ‘కళాకృషి పురస్కార్-2022’ కు ఎంపికయ్యారు.గోదావరిఖనికి చెందిన కృషి కల్చరల్ అకాడమి ద్వి దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 27న హైద్రాబాద్ రవీంద్రభారతిలో జరుగనున్న వేడుకలలో చంద్రపాల్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. చంద్రపాల్ మూడు దశాబ్దాలుగా హాస్య కళాకారుడిగానేగాక నటుడిగా, పౌరాణిక,సాంఘిక నాటక కళాకారుడిగా పలు ప్రదర్శనలు చేసి ప్రముఖుల ప్రశంసలందుకున్నారు.

సింగరేణి సంస్థ నిర్మించిన పలు టెలిఫిల్మ్ లలో నటించటమేగాక స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ‘మార్గదర్శి, ఖాంధాన్, దీర్ఘాయుష్మాన్ భవః’ లాంటి సందేశాత్మక లఘు చిత్రాలను నిర్మించగా తాను దర్శకత్వం వహించిన మొదటి లఘుచిత్రం ‘మార్గదర్శి’ ఉత్తమ చిత్రంగా ఎన్నికై సింగరేణి సి అండ్ ఎం.డి ద్వారా అవార్డ్ స్వీకరించడం విశేషం. చంద్రపాల్ నటుడిగా, దర్శకుడిగా, కళాకారుడిగా రాణిస్తూనే నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ సంస్థను స్థాపించి తానే తన మొబైల్ ద్వారా షూట్ చేసి ‘ఓ తండ్రి చివరి లేఖ, ఆధార్ కార్డ్, ఓ తండ్రి డైరీలో చివరి పేజీ, కరోనా వ్యాక్సిన్, గొప్పమనసు, అల వృద్దాశ్రమములో’లాంటి సందేశాత్మక లఘు చిత్రాలు, ‘ఓ మానవ, ఛాయిస్ ఈస్ యువర్స్, నీరు నీరు నీరు, నీరు-కన్నీరు’ లాంటిడాక్యుమెంటరీలు నిర్మించి సమాజహితానికి తోడ్పడ్డారు. చంద్రపాల్ హాస్య కళాకారుడిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో పలు ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో బహుమతులు సాదించడమేగాక, జగిత్యాల పెన్షనర్స్ అసోసియేషన్ చే ‘హాస్య శిరోమణి’ అవార్డునందుకున్నారు.

కోల్ ఇండియా స్థాయి సాంస్కృతిక పోటీలలో హాస్యాభినయ విభాగంలో హాస్యకళాకారుడిగా సింగరేణికి ప్రాతినిధ్యం వహిస్తూ రెండు సార్లు మెడల్స్ సాధించిన ఏకైక సింగరేణియుడు చంద్రపాల్. చంద్రపాల్ కళాకారుడిగానేగాక హాకీ గోల్ కీపర్ గా సింగరేణి సంస్థకు 15 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి పలు కోల్ ఇండియా స్థాయి పతకాలు సాధించడం విశేషం. కళాకారుడిగా, లఘుచిత్ర రచయితగా, దర్శకుడిగా,నిర్మాతగా కళా సేవచేస్తున్న చంద్రపాల్ కు ‘కళాకృషి’ అవార్డ్ అందించడం తమ సంస్థకు గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు.చంద్రపాల్ ఈ అవార్డ్ కు ఎంపిక కావడం పట్ల ఓపెన్ కాస్ట్-1 ప్రాజెక్ట్ ఆఫీసర్ రాధాకృష్ణ, మేనేజర్ ఉదయ్ హరిజన్, గని అధికారులు, కార్మికులు, పలు కళా సంస్థల బాధ్యులు చంద్రపాల్ కు అభినందనలు తెలిపారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *