కుండపోత వర్షంతో భాగ్యనగరం అతలాకుతలం, డ్రైనేజీలో వ్యక్తి గల్లంతు

మహానగరంలో మరోసారి భారీ వర్షం దంచికొట్టింది. శనివారం రాత్రి 7-9 గంటల మధ్య కురిసిన కుండపోత వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రహదారులు నీట మునగడంతో ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మణికొండ, షేక్‌పేట, ఫిలింనగర్‌, ఉప్పల్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, ఖైరతాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌, హయత్‌నగర్‌, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

రాత్రి 9.30 గంటల వరకు అత్యధికంగా మణికొండలో అత్యధికంగా 10.5, షేక్‌పేట్‌లో 6.4, నాచారంలో 6 సెం.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో నగరవాసులు సాయం కోసం 040-29555500 నంబర్‌లో సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. భారీవర్షం నేపథ్యంలో బల్దియా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించాలని మేయర్‌ గద్వాల విజయలక్ష్మి శనివారం రాత్రి ఆదేశాలిచ్చారు.

పలు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోవడంతో ప్రజలు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మూసారాంబాగ్‌ వంతెనపై నుంచి నీరు పొంగి ప్రవహిస్తుండడంతో పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. నగరంలో కురిసిన భారీవర్షంతో శనివారం రాత్రి మణికొండ గోల్డెన్‌ టెంపుల్‌ వద్ద నిర్మాణంలో ఉన్న డ్రైనేజీలో పడి ఓ వ్యక్తి(30)గల్లంతయ్యాడు. ఆ మార్గమంతా నీటితో నిండిపోయిన సమయంలో ఓ వ్యక్తి అటువైపుగా వెళ్లడం స్థానికులు గమనించారు. ప్రమాదం ఉందని చెబుతున్న సమయంలోనే ఆ వ్యక్తి మురుగుకాల్వలో పడి కొట్టుకుపోయినట్టు స్థానికులు తెలిపారు. నార్సింగి సీఐ గంగాధర్‌, ఎస్సై రాములు గాలింపు చర్యలు చేపట్టారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *